Saturday, July 5, 2025

Land Mafia In Bejjanki: అసైన్డ్ భూముల అమ్మకం

  •  గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు పంపిణీ

  •  బెజ్జంకిలో స్వాధీనం.. మిగతాచోట్ల పరాధీనం

  •  జిల్లాలోనూ చాలా చోట్ల అసైన్డ్ భూములు ఆక్రమణ

  •  పట్టించుకోవడంలో అధికారుల విఫలం

  •  బెజ్జంకి ఘటనతోనైనా కదలిక వచ్చేనా..?

(కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్)

నిరుపేదలు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వమే భుములను పంచిపెట్టింది. అసైన్డ్‌ పేరుతో ప్రభుత్వం పంచిన భూములను కొందరు సాగు చేసుకుంటుంటే.. మరికొందరు అమ్ముకున్నారు. ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులను బదలాయించడం, క్రయవిక్రయాలు చేయడం 1977 పీవోటీ చట్టం ప్రకారం నిషేధం. అయినా.. కొందరు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని కాంగ్రెస్ విధానానికి తూట్లు పొడిచి యథేచ్ఛగా రాజ్యమేలుతున్నారు.

Land Mafia In Bejjanki:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామగ్రామాన నిరుపేదలకు భూములను పంచింది. లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వ భూములను అందజేసి యాజమాన్య హక్కులను కల్పించింది. అయితే.. ప్రభుత్వం అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా గుంట నుండి మొదలుకొని ఎకరాల వరకు పంపిణీ చేసింది. ప్రభుత్వ భూములనే కాకుండా.. పలు గ్రామాల్లో భూములు అధికంగా ఉన్న రైతుల నుండి సీలింగ్ పేరుతో స్వాధీనం చేసుకొని పేదలకు అందించారు. ప్రభుత్వం పంచిన అసైన్డు భూముల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యుల పేరిట మాత్రమే యాజమాన్య హక్కు మారుతుంది. ఆయా కుటుంబ సభ్యులు మాత్రమే అట్టి భూములను అనుభవించుకునే అవకాశం ఉంటుంది. అయితే.. లబ్ధిదారుల్లో కొందరు భూములను చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారు. మరికొందరు సాగు చేయకుండానే ఇతరులకు విక్రయించేశారు. నీటి వనరులు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు కొందరైతే.. అమ్ముకుంటే వచ్చిన సొమ్మును ఖర్చు చేసుకుని తిరిగి నిరుపేదలుగానే ఉన్న వారు మరికొందరు. 1977 పీవోటీ చట్టం (బదలాయింపు నిషేధిత చట్టం) ప్రకారం ప్రభుత్వం నుండి పొందిన భూములను అమ్ముకోరాదు. ఎవరైనా కొనుగోలు చేసినా చట్టవిరుద్ధమే. ప్రభుత్వం పంచిన పలు భూములు అసలైన లబ్ధిదారుల చేతుల్లో కాకుండా పరుల ఆధీనంలో ఉన్నాయి. కొన్ని భూములైతే ఏకంగా రిజిష్ర్టేషన్లు అయ్యాయి. పేదల బలహీనతలను ఆసరగా చేసుకున్న కొందరు తక్కువ ధరలకు అసైన్డు భూములను కాజేశారు.

  • కొన్న వాళ్లు కోటీశ్వరులయ్యారు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ర్టం సిద్ధించాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల భూములు పంపిణీ అయ్యాయి. కొత్తగా లబ్ధిదారులకు ప్రభుత్వాలు భూములను కేటాయించినా, పాత భూముల విషయాన్ని పట్టించుకోవడం లేదు. పలువురు లబ్ధిదారులు అమ్మకున్నా, ఇతరులు కొనుగోలు చేసి అనుభవిస్తున్నా వాటివైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కొనుగోలు చేసిన వారిలో కోటీశ్వరులున్నా, రాజకీయ నేతలున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నాడు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు పలుచోట్ల విలువైనవిగా మారాయి. ఒక్కో ఎకరానికి కోట్ల రూపాయల ధర పలుకుతుంటే కొనుగోలు చేసిన వారు కోటీశ్వరులుగా మారుతున్నారు. ఇదిలా ఉంటే అసైన్డు భూములు అమ్ముకున్న పేదలు సైతం తిరిగి తమకు భూములు కావాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న సందర్భాలున్నాయి. ప్రభుత్వం అసైన్డు చేసిన భూములను లబ్ధిదారులు అమ్ముకుంటే తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్న దాఖలాలు కానరావడం లేదు. అసైన్డు భూముల క్రయవిక్రయాలు జరిగినట్లు అధికారులకు నోటీసులో ఉన్నా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

  • ఫిర్యాదులు వస్తేనే చర్యలా…

అసైన్డ్‌ భూముల విషయంలో స్పష్టమైన ఫిర్యాదులు వస్తేనే అధికారులు చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గ్రామాల్లో అనేక మంది లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన భూములను విక్రయించుకున్నారు. గ్రామాల్లో వ్యక్తిగతంగానో, రాజకీయ పరంగానో విభేదాలు తలెత్తినప్పుడు అసైన్డు భూముల విషయంలో అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే.. ఫిర్యాదులు అందిన భూములపైన మాత్రమే అధికారులు స్పందిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన అన్నిచోట్ల అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అసైన్డు భూములు పరుల చేతిలో ఉన్నట్లు తేలినా పలుచోట్ల మాత్రమే భూములను అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పజెప్పుతున్నారు. ఫిర్యాదులు వచ్చిన వాటిలో సైతం అధికార పార్టీ నాయకులు, బడాబాబుల వద్ద అసైన్డు భూములున్నా అటు వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. చట్టం వారికి చుట్టంగా మారింది.

  • కేవలం బెజ్జంకిలోనేనా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో అసైన్డు భూములు అమ్ముడు పోయిన ఇటీవల బెజ్జంకి మండల కేంద్రంలో 31 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు బోర్డులు పాతేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు మండలాల్లో సైతం అసైన్డ్ భూములు లబ్ధిదారుల చేతిలో కాకుండా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, నుస్తులాపూర్ గ్రామాల్లో అసైన్డు భూములు అమ్మకాలు వివాదాస్పదంగా మారాయి. నుస్తులాపూర్‌లో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న అసైన్డు భూమిలో ఇతరులు నిర్మాణాలు చేపడితే అధికారులు కూలగొట్టినట్లు, తిమ్మాపూర్ పరిధిలోని ఓ విద్యా సంస్థ పరిధిలో సుమారు పదిహేను ఎకరాల అసైన్డు భూమి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా.. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అసైన్డు భూములపై ప్రభుత్వం దృష్టి సారించి అమ్ముడుపోయిన వాటిని స్వాధీనం చేసుకోవాలని వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page