వినతిపత్రం అందజేసిన నరసింహుల పల్లి వాసులు
బెజ్జంకి టౌన్, జనతా న్యూస్:ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తమ గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయడం తగదని, ఆ ఫ్యాక్టరీని తక్షణమే రద్దు పరచాలని లేదంటే తాము ప్రాణాలకు తెగించి అయినా పోరాటాలు చేస్తామని తెలుపుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బెజ్జంకి మండలంలోని నరసింహుల పల్లె వాసులు పలువురు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు . తమ గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఇథనాల్ కంపనీ వారి వ్యర్థపదార్థాల నిల్వ ల కోసం పనులు ప్రారంభిస్తున్నారని వాటిని వెంటనే నిలిపివేసి ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ, పలువురు గ్రామస్తులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనను తెలిపారు. ఆ ఫ్యాక్టరీ వల్ల తమ ప్రాంతం వల్లకాడు అవుతుందని వ్యర్థపదార్థాల దుర్వాసన తాము భరించలేమని మనుషులతో పాటు పశువులు, పక్షులు బతకలేవని పంటలు పండవని వారు ఆవేదనను వెలిబుచ్చారు . తాము ప్రాణాల కైనా తెగిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించనియమని వారు స్పష్టం చేశారు. ఎప్పుడో ప్రాణాలు వీడే బదులు ఇప్పుడే ప్రాణాలు విడడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు . లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.