Saturday, July 5, 2025

Karimnagar Land Mafia : ఎవ్వరినీ వదలం..

  •  భూ ప్రకంపనల్లో సొంత శాఖపై పోలీసుల చర్యలు
  •  తాజాగా.. జగిత్యాల సీఐపై సస్పెన్షన్ వేటు
  •  మరో ఏసీపీ స్థాయి అధికారిపై కొనసాగుతున్న విచారణ
  •  భూకబ్జాదారులకు పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలు
  •  పదేళ్లపాటు వారు చేసిందే శాసనం.. వారి చెప్పిందే న్యాయం..
  •  అప్పటి పైస్థాయి అధికారుల సహకారంతో రెచ్చిపోయిన సిబ్బంది
(కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్)

Karimnagar Land Mafia :ప్రజల హక్కులకు, ఆస్తులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే బాధితులకు పోలీసులు గుర్తుకువస్తారు. ఇతరుల నుంచి ఏ కష్టం, నష్టం ఎదురైనా రక్షణ కోసం, న్యాయం కోసం తొలుత పోలీస్ స్టేషన్ గడపనే తొక్కుతారు. అంతటి మహోన్నత గల ఆ శాఖలో కొందరి వైఖరి చర్చనీయాంశంగా మారింది. న్యాయం చేయండి మహాప్రభో అంటూ బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. అంతేకాదు.. తమ ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని.. ఇబ్బందుల్లో ఉన్నామని.. ఆదుకోవాలని కోరితే పర్సంటేజీలు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ ప్రకంపనల పంచాయితీ కొనసాగుతోంది. అయితే.. ఇప్పటివరకు ఈ కేసులో ప్రజాప్రతినిధులను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మొన్నటికి మొన్న ఓ రెవెన్యూ అధికారిని సైతం చేర్చారు. కాగా.. ఇప్పుడు సొంత శాఖపైనే చర్యలకు దిగారు. దీంతో ఈ పరిణామంతో బాధితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సొంత శాఖపైనే చర్యలకు దిగుతుండడంతో అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలేది లేదని.. మరోసారి సీపీ అభిషేక్ మహంతి నిరూపించారు. ఈ చర్యతో అక్రమదారుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. తదుపరి ఎవరా అని టెన్షన్‌లో పడిపోయారు.

For E-paper Janatha daily click here

Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)

మొన్న రెవెన్యూ అధికారి..

జిల్లాలో గత పదేళ్లలో ప్రజాప్రతినిధులు, పలువురు అధికారుల ఆగడాలకు అడ్డు లేకుండాపోయింది. దీంతో అప్పటి నేతల అండదండలు చూసుకొని కింద స్థాయి నాయకులు ఇష్టారాజ్యంగా కబ్జాలు, భూదందాలు చేశారు. వీరికి కొందరు రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు తోడయ్యారు. ముఖ్యంగా పోలీసులు సైతం తోడవ్వడంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారు కరువయ్యారు. నకిలీ పత్రాలు సృష్టించి.. భూమిలను కాజేసిన వారూ ఉన్నారు. భూ కబ్జాల కేసులో ఇప్పటివరకు సుమారు 11 మందికి పైగానే అరెస్టు చేయగా.. వారిలో కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు, తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇటీవల మరో కీలక నేతను అరెస్టు చేసిన కేసులో మాత్రం రెవెన్యూ అధికారిని సైతం చేర్చారు. ఆయన సహకారం వల్లే పెద్ద ఎత్తున దందాలు సాగించినట్లుగా వెల్లడి కావడంతో నిందితుడిగా చేర్చారు. అయితే.. ఇప్పటివరకు లోకల్ లీడర్లనే టార్గెట్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం సొంత శాఖపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

పోలీస్ శాఖపై దృష్టి..

కమిషనరేట్ పరిధిలో భూ బాధితులకు అండగా నిలిచేందుకు సీపీ అభిషేక్ మహంతి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు 700లకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కటిగా విచారణ చేపడుతున్న పోలీస్ బాస్ నిందితులను ఎంక్వయిరీకి పిలిచి తర్వాత అరెస్ట్ చూపుతున్నారు. అయితే.. తాజాగా జగిత్యాల టౌన్ సీఐ నటేశ్‌పై పోలీస్ శాఖ వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడడం.. కేసులు నమోదం చేయకపోవడంతో క్రమశిక్షణ చర్యలు అంటూ ఏవేవో వినిపిస్తున్నా.. ప్రధానంగా ఈ భూ సెటిల్‌మెంట్లు కూడా ఈ కేసులు కీలకమనే ప్రచారం వినిపిస్తోంది. గతంలో నిర్మాణంలో తన ఇంటిని కొందరు వచ్చి కూల్చివేశారని.. కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఓ వృద్ధుడు వేడుకున్నా.. పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆ వృద్ధుడి మనవరాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. తాను చేసిందే శాసనం.. తాను చెప్పిందే న్యాయం అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి నడిచినట్లుగా చర్చ నడుస్తోంది. ఈ ఒక్కటే కాకుండా ఆయనపై చాలావరకు ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదులతోపాటు నిఘా వర్గాల సమాచారంతో విచారణ చేపట్టి ఈ చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఆయనపై వేటు పడడంతో ఆయన బాధితులంతా ఇప్పుడు ఆనందంలో మునిగిపోయారు.

తదుపరి ఆ అధికారేనా..?

గతంలో ఇక్కడ పనిచేసిన మరో ఏసీపీ స్థాయి అధికారిపై విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన హయాంలోనూ అప్పట్లో భూకబ్జాలకు పాల్పడిన అక్రమార్కులకు సహకరించినట్లుగా భారీగానే ఆరోపణలు వచ్చాయి. పలువురు ప్రజాప్రతినిధిగా దగ్గరగా మెయింటెన్ చేసి తన పూర్తి ‘సహకారం’ అందించినట్లుగా ఫిర్యాదులు సైతం ఉన్నాయి. అప్పటి ఓ ముఖ్య ప్రజాప్రతినిధికి షాడోలా వ్యవహరించినట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆ పోలీస్ అధికారిని ఆసరా చేసుకొని.. భూకబ్జా పరులు మరింత రెచ్చిపోయినట్లుగా సమాచారం. అంతేకాదు.. వారి కబ్జాల్లో సదరు అధికారికి పర్సంటేజీలు సైతం ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఆ స్థాయిలో వారికి సహకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు భూకబ్జా దారులను ఒక్కొక్కరిని కటకటాల్లోకి పంపిస్తుండడంతో.. తదుపరి ఆ అధికారి సైతం టార్గెట్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనపై విచారణ సైతం పూర్తయిందని.. అందుకే ఆయనను లూప్‌లైన్‌లో పెట్టారని సమాచారం. రేపోమాపో శాఖాపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. వీరికి కొందరు పైస్థాయి అధికారులు సైతం సహకరించినట్లుగా సమాచారం. వారి అండ చూసుకొని కబ్జాలను, సెటిల్‌మెంట్ దందాలను ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page