Medaram Maha Jathara : మేడారం జాతర గడియలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నుంచి ప్రధాన జాతర సాగనుంది. ఈ సందర్భంగా వనంలో ఉన్న వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన కుమారుడు జంపన్న మంగళవారం మేడారం బయలుదేరనున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల లోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును.. ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు. మంగళవారం ఉదయం పూనుగొండ్ల సమీపంలోని దేవుని గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్టించి శాంతి పూజలు చేస్తారు. అనంతరం పెన్క వంశీయుల పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్ళికొడుకుగా సిద్ధం చేస్తారు. ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకువెళ్తారు. పూజారితోపాటు పదిమంది భక్తులు పగిడిద్దరాజు వెంట వస్తారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురం లో పెన్క వంశీయులు ఇంట్లో రాత్రి విడిది చేస్తారు. బుధవారం ఉదయాన్నే బయలుదేరి సారాలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం వద్దకు చేరుస్తారని పూజారులు తెలిపారు.
అటు సమ్మక్క తనయుడు జంపన్నను పోలెబెయిన వంస్థులు కన్నెపల్లి నుంచి మేడారం తీసుకురానున్నారు. పూజారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి మేడారానికి చేరుకుంటారు.