Karimnagar : కరీంనగర్, జనత న్యూస్: కరీంనగర్ మాత శిశు కేంద్రంలో 3 రోజుల పాప కిడ్నాప్ ను కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంపై కరీంనగర్ పోలీసులు సోమవారం మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 18 ఆదివారం మాతా శిశు కేంద్రంలోని తమ పాపను కిడ్నాప్ చేశారనని కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం మాతా శిశు కేంద్రంలో తనిఖీలు నిర్వహించింది.

సీసీ పుటేజీలను పరిశీలించి విచారణ జరపగా పెద్దపల్లి జిల్లాలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ పద్మ వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను పోలీసులు విచారించగా తనకు పిల్లలు లేనందున కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కు చెందిన ఎర్రమరాజు జగ్గం రాజు అనే డాక్టర్ సలహా మేరకు మతా శిశు కేంద్రంలో వ్యాక్సిన్ పేరు చెప్పి పాపను తీసుకెళ్లినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ విచారణలో కరీంనగర్ టౌన్ ఏసీపీ, నరేందర్, కరీంనగర్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఓ. వెంకటేశ్, జమ్మికుంట సీఐ V.రవి, టాస్క్ పోర్స్ సీఐ కిరణ్ రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు. కాగా నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు.