ఖమ్మం, జనతా న్యూస్: తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అధిష్టానాన్ని మెప్పించి, ఒప్పించి, టికెట్ దక్కించుకునే పనిలో ఆశావహులు బిజీగా ఉన్నారు. కొంత మంది సీనియర్లు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే, తెలంగాణలో ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక్కో రకమైన రాజకీయ పరిస్థితులు చుట్టుముట్టి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే లోక్‌సభ టికెట్ లొల్లి మొదలైంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట కావడంతో టికెట్ కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారుతెలంగాణలో ఖమ్మం లోక్‌సభ సీటు హాట్ కేక్‌గా మారింది. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండటంతో నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి…అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం, మహబూబాద్ పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గెలుపు బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది.
ఖమ్మం కాంగ్రెస్ లో ప్రజలు గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ, జిల్లా రాష్ట్ర నాయకులు మాత్రం గ్రూపులుగా ఉన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక గ్రూపుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి మరో గ్రూపుగా ఉండేవి. గత ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రెండు గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రూపులుగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీలో పైకి ఐక్యతగా కనిపిస్తున్నప్పటికీ, లోపల గ్రూప్ రాజకీయాలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం నాలుగు గ్రూపుల లీడర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పీసీసీ రాష్ట్ర నాయకులు రాయల్ నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజా టికెట్ కోసం యత్నిస్తున్నారు
కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న వారికి అధిష్టానం టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్, అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి చెబుతూ వస్తున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పోటీ చేయించాలని తెలంగాణ పీసీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఖమ్మం,నల్లగొండ పార్లమెంట్ స్థానాలలో ఒకచోట పోటీకి సోనియాగాంధీ దిగుతారని ఖమ్మంలో అయితే సోనియా గాంధీ విజయం సునాయాసమవుతుందని భావిస్తున్నారు. సోనియాగాంధీ పోటి చేయకపోతే మాత్రం సీటు తమకే ఇవ్వాలంటూ నాలుగు గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. నాలుగు గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్‌లో ఎవరికీ టిక్కెట్ దక్కుతుందో, అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందో అనే అంశం ఉత్కంఠగా మారింది.