Saturday, July 5, 2025

ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలు? 

– గడువుకు ముందే ఎలక్షన్లకు వెళ్లాలని యోచిస్తున్న బీజేపీ
– మార్చి-ఏప్రిల్‌ మధ్య పోలింగ్‌ జరిగే అవకాశం
– ఫిబ్రవరిలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ యోచన
– ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్‌?
– గడువు కంటే నెలన్నర ముందే లోక్‌సభ ఎలక్షన్లు?
(యాంసాని శివ కుమార్ ,ఎడిటర్)
లోక్‌సభ ఎన్నికలకు కేంద్రంలోని అధికారపక్షం సిద్దమవుతుందా ? ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ అనుకూలంగా పవనాలు వీస్తుండటమే దీనికి కారణమా.. ఫాంలో ఉన్నపుడే బరిలోకి దిగి విక్టరీ కొట్టాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ట్రాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. ప్రస్తుత లోక్‌సభ గడువు ముగియడానికి నెలన్నర రోజుల ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 16 వరకు ఉంది. ఆ లోగా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ మే నెలల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికల ప్రక్రియను మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే ముగించి మే మొదటి వారంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరే విధంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటివారంలోనే పార్లమెంట్‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల గడువు కూడా 2024 జూన్‌ వరకు ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ  రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఈ అంచనాలతోనే ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలపై తన క్యాబినెట్‌ సహచరులకు హింట్‌ ఇచ్చి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాదిలోని తెలంగాణ మినహా ఉత్తరాదిలోని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పడిపోయింది. బీజేపీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలోనే లోక్‌సభ ఎన్నికలను కూడా ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. గడువు ప్రకారం ఏప్రిల్‌-మే వరకు ఆగితే.. ఇప్పటి ఊపు తగ్గే ప్రమాదం ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడటం లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలు సైతం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌- సమాజ్‌వాదీపార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడల పట్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే కేరళలో సీపీఎంతో, ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌కు పొసగడం లేదు. కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఈ మధ్య అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి మళ్లీ ఐక్యతా రాగం వినిపించకముందే ఆయా పార్టీలను ఎన్నికల రంగంలోకి దించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తున్నది
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page