– రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
– స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి శ్రేణులు సిద్ధం కండి
– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
చిగురుమామిడి జనత న్యూస్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపి ని గద్దెదింపేందుకు ఇండియా కూటమిలో పార్టీలన్నీ పనిచేయాలని,తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం రోజున మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్ లో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశం మండల సహాయ కార్యదర్శి అందె చిన్న స్వామి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంనకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ,ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. దేశ సంపదను పెట్టుబడి దారులకు అప్పగించే కుట్రలు పన్నుతుందని,ఆ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తుందని విమర్శించారు. దీనిని నివారించడానికి కేంద్రంలో బీజేపీని గద్దెదింపేందుకు దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడిందని,కూటమిలో ఉన్న సీపీఐ జాతీయ నాయకత్వం సూచనల మేరకు తెలంగాణ లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఐ,కాంగ్రెస్ కలిసి పనిచేసాయని తెలిపారు.పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేశామని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐ తోడ్పాటు అందించిందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ,తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు,నిధులు,నియామకాల ప్రాతిపదికన గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్ర ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని,రైతు బంధు,ధరణీ పోర్టల్ లాంటి వాటిలో లోపాలు ఉన్నాయని వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ మద్ధతు తో కాంగ్రెస్ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గా గెలుపొందినాడని,ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి కట్టబెట్టిందని, హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం శుభ పరిణామమని మంత్రిగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో సర్పంచ్ లుగా,ఎంపీటీసీలుగా,జడ్పీటీసీ లుగా,ఎంపీపీ లుగా సీపీఐ అభ్యర్థుల పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి అందె చిన్న స్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, బూడిద సదాశివ,బోయిని పటేల్,ముద్రకోల రాజయ్య,సర్పంచ్ లు శ్రీమూర్తి రమేష్,గోలీ బాపురెడ్డి,ఆయా గ్రామాల సీపీఐ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు