Saturday, July 5, 2025

‘ఆరు’ గ్యారంటీయేనా ?

  •   వీటి అమలు కోసం మాత్ర‌మే ఏటా 68 వేల 652 కోట్ల రూపాయలు అవసరం !
  • గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగేనా ?
  • రేవంత్ ప్రభుత్వం ముందు పెను సవాళ్ళు
(యాంసాని శివ కుమార్, ఎడిటర్)

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలనూ నమ్మారు. వీటిని అమలు చేసే సమర్థవంతమైన నాయకుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజల విశ్వాసం. అందుకే కాంగ్రెస్ కు పట్టం కట్టారు.తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌ రెడ్డి రెండు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్‌ తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. ఆ నియామకపత్రాన్ని ఆమెకు స్వయంగా అందించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి, తొలి సంతకం నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడం మొదలుపెట్టారు. ఇది ప్రజా ప్రభుత్వమని, తాము పాలకులం కాదు, ప్రజా సేవకులం అంటూ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ, ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపారు.

ఒకవైపు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ప్రజానీకం మాత్రం, కాంగ్రెస్‌ వైపు చూసి ఆశీర్వదించింది. ఇక్కడి నుంచే మొదలయ్యాయి కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు. వీటిని దక్షిణాది మొత్తం విస్తరింపజేయాలని వ్యూహరచనలు జరుగుతున్నాయి. దేశంలో కాంగ్రెస్‌ అనుకూల పవనలు వీస్తున్నాయని సంకేతం, తెలంగాణ విజయంతో తేటతెల్లమైంది.

కాంగ్రెస్‌ ఆ ఆరు గ్యారంటీలు ఇవే..!
  1.  మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
  2.  రైతుభరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం, వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
  3.  గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.
  4.  ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5లక్షల సాయం.,ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.
  5.  యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
  6.  చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను, రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా
ఆ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యాసాధ్యాలు
  • ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు 69 వేల కోట్ల రూపాయలు ఖర్చువుతుందనేది ఆర్థిక నిపుణుల అంచనా. అర్హులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు తర్వాత వ్యయంపై మరింత స్పష్టత రానుంది. గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తే వాటి అమలును ప్రశ్నించే హక్కు ప్రజలకు లభిస్తుంది.
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ విజయంలో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. కొన్ని హామీలను భవిష్యత్‌లో నెరవేర్చగలిగినప్పటికీ.. మరికొన్ని తక్షణమే నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది.
    కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పెంపు, రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, గృహజ్యోతి, యువవికాసం, చేయూత ఫించన్లు ముఖ్యమైనవి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. అయితే, ఈ పథకానికి ఏటా సుమారు రూ.18 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులుండగా.. అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందనే తెలియనుంది.

  • రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాలుకు రూ.500 అదనపు సాయం. రైతుబంధు పథకం కింద మొదటి విడత గత ప్రభుత్వం పంపిణీ చేసినందున.. ఇప్పుడు రెండో విడత చెల్లించాల్సి ఉంది. ఎన్నికల హామీ ప్రకారం మొదట ఇచ్చిన రూ.5 వేలతో పాటు మరో రూ.10 వేల చొప్పున అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.2 లక్షల రుణ మాఫీ వీటిని అమలుచేయాలంటే ఏడాదికి రూ.1.2 లక్షల కోట్టు ఖర్చవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ఏటా లక్షా 20 వేల లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్ర‌మే ఏటా 68 వేల 652 కోట్ల రూపాయలు అవసరమని తెలుస్తోంది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం 20 వేల కోట్ల రూపాయలు అవసరం. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయం దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, కేంద్ర నిధులతో కలిపి లక్షా 72 వేల కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెట్ దాదాపు 1.90 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
  • ఆర్టీసీ లాంటి కార్పొరేషన్‌లు ఇప్పటికే ఆర్థికంగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆర్టీసీకి 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు చేస్తే డిస్కమ్‌లకు ఏటా 5 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తోంది. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే రుణాలు తీసుకోవాల్సి అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రం రుణ పరిమితిని చేరుకుందని.. రుణాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తవచ్చనేది వారి అభిప్రాయం.

అంతేకాదు..బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలు, జీతాలు, పెన్షన్‌ల వైపు వెళితే, రోడ్లు, వంతెనలు, పెద్ద ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాల పనుల వంటి మూలధన వ్యయం తీసుకోవడానికి ఖచ్చితంగా నిధులు ఉండకపోవచ్చని ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page