- నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం చేపట్టాలి
- దుబారా పథకాలను తూర్పారా బట్టాలి
- ఆర్థికంగా నిలబడేలా పథకాలకు రూపకల్పన
తెలంగాణ ఏర్పడడానికి నిరుద్యోగులు కూడా ప్రధాన కారణం. నిరుద్యోగులు, యువత ఉద్యమాన్ని తమ భుజాలపైకి ఎత్తుకుని పోరాడారు. జర్నలిస్టులు కూడా నిజాయితీగా పోరాడారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తరవాత వీరిద్దరూ మోసపోయారు. నిజానికి వీరు చదివిన చదువులకు తగ్గ కొలువులు ఇవ్వలేదు. కనీసం డిఎస్సీలు కూడా నిర్వహించలేదని చాలా మంది నిరాశతో ఉన్నారు. ఉన్న స్కూళ్లను మూసేసి ఉద్యోగాలను సర్దుబాటు చేయడంతో విద్యారంగం భ్రష్టు పట్టిందని చాలా మంది ఆరోపించారు. ఇప్పుడీ రంగాలను సిఎంగా రేవంత్ రెడ్డి సంస్కరించాలని చాలా మంది కోరుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసి, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ వచ్చిన తరవాత ఉద్యోగాలు వస్తాయని చాలా మంది ఆశపడ్డారు. కానీ తొమ్మిదిన్నరేళ్లలో జాబ్స్ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. అయితే ఇప్పడు ప్రభుత్వం మారిన తరువాత ఉద్యోగాలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం చేస్తుందోనని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇదే సమయంలో ఆరు గ్యారంటీల పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తరువాత చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని భావించారు. అయతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశెట్టిన ఆరు గ్యారంటీల పథకాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. దీంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈనేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఉద్యోగాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్, ఒంటరి మహిళలకు పింఛన్, కల్యాణలక్ష్మి పథకాలతో చాలా మంది అర్హులకు ప్రయోజనాలు జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాత పథకాల్లో ప్రక్షాళన చేయనున్నారా? లేక కొత్త పథకాలతో లాభం చేకూరుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ఉద్యోగాలు కల్పిస్తూ.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహణను సక్రమంగా కొనసాగిస్తూ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఇప్పటికే తెలంగాన ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని కొందరు మేధావులు అంటున్నారు ప్రస్తుతం లోటు బడ్జెట్ లోనే ప్రభుత్వం సాగుతుందని అంటున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఆర్తికంగా బలపడేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.