- కెసిఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో పురోగతి
- అందుకే హ్యాట్రిక్ కొడతామన్న భరోసా కలిగింది
- కాంగ్రెస్, బిజెపిల దుష్పచ్రారమే దెబ్బతీసింది
(యాంసాని శివకుమార్-ఎడిటర్)
పదేళ్ల తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్ర ముఖచిత్రం మారిందని, కానీఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడం బాధ కలిగించిందని కరీంనగర్ నుంచి విజయం సాధించిన, మాజీమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత ఆయన సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మాట్లాడుతూ ఎన్ని మంచి పనులు చేసినా అధికారం కోల్పోవడం బాధగా ఉందన్నారు. ఈ పదేళ్ల కాలంలో కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయనడంలో సందేహం లేదన్నారు. అయితే ఓటమి చెందినా ప్రజల్లో ఉంటూ..వారి పక్షాన పోరాడుతామని ఆయన అన్నారు. కెసిఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా అన్ని రంగాల్లో అభివృద్ది కళ్లకు కనపడు తోందని అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా అభివృద్ది కనిపించదని అన్నారు. డబుల్ ఇంజన్ అంటూ పెడబొబ్బలు పెడుతున్న గుజరాత్‌లో కూడా కనీసం 24 గంటల కరెంట్ కనిపించదన్న విషయం మోడీకి తెలియింది కాదన్నారు. పేదల సంక్షేమం కోసమే అమలు చేసేవి సంక్షేమ పథకాలని, సంక్షేమంతో పాటు అభివృద్దిని జోడిరచి పాలన సాగిందని అన్నారు. బిసిలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే బీసీలకు లక్ష రూపాయల నగదు సహాయాన్ని ఓ సామాజిక మార్పుకు నాందిగా ప్రకటించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని గంగుల అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందడం లేదన్న విషయాన్ని గర్వంగా చెప్పగలమని అన్నారు. కొన్ని ఇండ్లలో రెండు, మూడు పథకాలు అందుతున్న లబ్దిదారులున్నారన్నారు. మేము ప్రజలకు చేసినవి మాత్రమే చెప్పి ఓట్లు అడిగామని అన్నారు. రైతుబంధు వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సమస్య తీరిందన్నారు. గ్రామాల్లో ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వం స్థలం అందజేస్తుందని, అందులో స్వంతంగా ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షల ఇంటి పథకం మంజూరు చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు. ఇచ్చిన హావిూ మేరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేసామన్నారు. ఈ భూములకు కూడా రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుంచేలా కెసిఆర్ ఆదేశాలు కూడా ఇచ్చారని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి, సంక్షేమం తెలియదని, సోషల్ విూడియా, వాట్సాప్‌లో ప్రచారం చేసుకోవడం ఒక్కటే తెలుసునని ఎన్నికల ఫలితాల ద్వారా గుర్తించామని విమర్శించారు. బీడీ పరిశ్రమ మూతపడుతున్న తరుణంలో లక్షలాది మంది కార్మికులకు పెన్షన్ అందజేసి కొండంత ధైర్యం ఇచ్చిందన్నారు. సంక్షేమం అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సహాయం చేయడమేనని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గౌడన్నలతోపాటు ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆసరాగా నిలబడిరదని అన్నారు. అయితే ప్రజా తీర్పుకు అందరూ కట్టుబడాల్సిందే నని అన్నారు. తాము కూడా నిర్మాణాత్మక విపక్షంగా ఉంటామని గంగుల అన్నారు. జిల్లాలో సమస్యలపై ఇక దృష్టి సారిస్తామని, చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేగా తనవంతు కర్తవ్యం నిర్వహిస్తానని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కూడా చేస్తామని అన్నారు.
“““