- గెలిచిన మంత్రులు కెటిఆర్, గంగుల
- ఓడిన బిజెపి ఎంపిలు బండి, ధర్మపురి
- హుస్నాబాద్‌లో విజయం సాధించిన పొన్నం
కరీంనగర్, జనతా న్యూస్ : కరీంనగర్ జిల్లాలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఇద్దరు మంత్రులు గెలుపొందగా, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపిలు ఓటమి పాలయ్యారు. ధర్మపురిలో మంత్రి కొప్పులు ఓటమి చెందారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల తారకరామారావు విజయం సాధించారు. సవిూప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు. 30వేలకుపైగా ఓట్ల మెజారిటీ కేటీఆర్ గెలుపొందారు.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. 2009 నుంచి సిరిసిల్ల ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2009, 2010 ఉప ఎన్నికలు, 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇకపోతే కరీంనగర్‌లో అనూహ్య ఫలితం వచ్చింది. మంత్రి గంగుల కమలాకర్ చేతిలో బిజెపి ఎంపి, జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఓటమి చెందారు. అలాగే కోరుట్లలో మరో ఎంపి ధర్మపురి అర్వింద్ బిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇకపోతే మంథనిలో కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధశర్ బాబు కూడా మరోమారు ఘన విజయం సాధించారు. హుస్నాబాద్‌లో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. వేములవాడలో గతంలో పోరాటం చేసిన ఆది శ్రీనివాస్ ఎట్టకేలకు విజయం సాధించారు. ఇకపోతే మానకొండూరులో రసమయి బాలకిషన్ ఓటమి చెందారు. మొత్తంగా బిఆర్‌ఎస్‌కు పట్టుగా ఉన్న జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.