-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులను రెండు రోజుల్లోగా పంపిణీ పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
బుధవారం ఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవిఎం యంత్రాల కమిషనింగ్, ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 10 లక్షల 59 వేల 215 ఓటర్లలో ఇప్పటి వరకు 7 లక్షల 37 వేల773మంది ఓటర్లకు ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలిన ఓటర్లకు త్వరితగతిన ఓటరు సమాచార స్లిప్పులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లాకు వచ్చిన లక్ష 11 వేల 931 ఓటర్ గుర్తింపు కార్డులలో 1లక్ష 09వేల 509 కార్డులను పంపిణీ చేయడం జరిగిందని మిగతా ఓటరు గుర్తింపు కార్డులను రెండు రోజుల్లోగా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆబ్సెంటి ఓటర్లు కోసం 1195 పోస్టల్ బ్యాలెట్స్12డి అందించడం,హోమ్ ఓటింగ్ కోసం 31 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 1338 పోలింగ్ కేంద్రాలకు 1477 పోలింగ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిసెప్షన్ అండ్ రిసిప్షన్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామని అన్నారు.
జిల్లాలో కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించి వారికి శిక్షణ అందిస్తున్నామని, పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
జిల్లా పరిధిలో ఎన్నికల ప్రచార నిమిత్తం రాజకీయ నాయకులు నిర్వహించే సమావేశాలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘనలపై ఇప్పటివరకు జిల్లాలో 18 ఎంసిసి ఫిర్యాదులు అందాయని వాటిలో 6 పరిష్కారం చేయడం జరిగిందన్నారు.నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, కరీంనగర్ రిటర్నింగ్ అధికారి మహేశ్వర్, జిఎం డి ఐ సి నవీన్ కుమార్, ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాసరావు, డి పిఓ వీర బుచ్చయ్య, డి ఆర్ డి ఓ శ్రీలత, సిపి ఓ కొమరయ్య, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.