హైదరాబాద్, జనతా న్యూస్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఘట్టం పూర్తయింది. పోటీలో నిలిచేవారెవరో తేలిపోయింది. సోమవారం, మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం శాసనసభ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు మిగిలారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. సోమవారం జరిగిన స్కూటీ నీలో 68 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. పరిశీలన అనంతరం మిగిలిన 2,898 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అత్యధికంగా గజ్వేల్ లో 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మేడ్చల్ లో 67, కామారెడ్డిలో 57, ఎల్బీనగర్లో 50 మంది ఉన్నారు. కొడంగల్ లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో కేవలం ఏడుగురు అభ్యర్థులు, బాల్కొండలో 9మంది ఉన్నారు.
కరీంనగర్ లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటీని అనంతరం 261 నామినేషన్లు ఆమోదం పొందాయి. అయితే ఇందులో మంగళవారం 7గురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో 254 మంది బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు కొంత మందిని బుజ్జగించడం ప్రారంభమైంది. తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందుకు అవసరమైన తాయిలాలను ప్రకటిస్తున్నారు.