Kcr Gajwel : తెలంగాణలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా ఓ వ్యక్తి మొదటి నామినేషన్ దాఖలు చేశారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ తరుపున ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు పద్మరాజన్ అనే వ్యక్తి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయనను ఎలక్షన్ కింగ్ అని పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రం సేలం కు చెందిన 66 ఏళ్ల పద్మరాజన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ ఎన్నికల్లో 236 సార్లు నామినేషన్ వేసినట్లు మీడియాకు తెలిపారు. కేసీఆర్ పై పోటీ చేసేందుకు 237వ నామినేషన్ వేసినట్లు తెలిపారు. కాగా గజ్వేల్ నుంచి ఇప్పటికే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి బరిలో ఉన్నారు. మొదటి నామినేషన్ ఇండిపెండెంట్ ది కావడం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.