-
ప్రచారంలో పాల్గొనని బెజ్జంకి సర్పంచ్
-
ఆందోళనలలో కేడర్
-
క్యాష్ చేసుకుంటున్న కాంగ్రెస్
-
రసమయి వ్యూహం ఏంటీ?
బూట్ల సూర్య ప్రకాష్ (మానకొండూరు నియోజకవర్గం ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెజ్జంకి మండల కేంద్రం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లోకి మారడంతో కాంగ్రెస్ పార్టీకి గత దశాబ్ద కాలంగా ఇక్కడ గడ్డు పరిస్థితిగా మారింది. కాగా, పార్టీలో నాయకులు అధికం కావడంతో వారిమద్య సఖ్యత లోపించి ఎవరికి వారే అన్న రీతీలో కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నేతలు పార్టీ మారినప్పటికీ అభివృద్ధి పనుల నేపథ్యమో, స్వలాభమో ఇప్పటివరకు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఎవరూ కనిపించడంలేదు. కానీ మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి పార్టీని బలోపేతం చేయడానికి ఇదే అవకాశంగా భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లోని పలువురు నాయకులను సంప్రదించి తిరిగి కాంగ్రెస్‌లో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు కవ్వంపల్లిపై ఉన్న సానుభూతి కి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది, మరో వైపు బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ గతంలో తనకు ఉన్న ప్రత్యక్ష సంబంధాలను ఉపయోగించు కుంటూ ఈ ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చి గెలుపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటి వరకు స్తబ్ధంగా ఉంటున్న ఆరెపల్లి మోహన్ ప్రస్తుత రాజకీయాలను గమనిస్తూ, గెలుపు ఓటమిలను బేరీజు వేస్తూ తన నిర్ణయాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
బెజ్జంకికి బీఆర్‌ఎస్ సర్పంచ్ ద్యావనపల్లి పల్లి మంజుల ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, ఎక్కువ ఓట్లను కలిగియున్న పద్మశాలి వర్గానికి చెందిన మంజుల గానీ, ఆమె భర్త మాజీ సర్పంచ్ ద్వావనపల్లి శ్రీనివాస్‌గానీ, వారి అనుచరులు గానీ బీఆర్‌ఎస్ ప్రచార సభలలో కాన రావటం లేదు. ద్యావన పల్లి శ్రీనివాస్ 20 సంవత్సరాలుగా ఉప సర్పంచ్ గా, సర్పంచ్ గా కొనసాగటంతో మండల కేంద్రంలో ప్రజల నాడీ తెలిసిన నేతగా శ్రీనివాసుకు పేరుంది. అలాగే ఇతర పార్టీల ప్రచారంలో సైతం ఆయన పాల్గొనకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. దీంతో పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. సర్పంచ్ మంజులకు స్థానిక బీఆర్‌ఎస్ ఎంపీపీకి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నట్లు బహిరంగ రహస్యం. గతంలో ఎలాంటి అభివృద్ధి పనులను సర్పంచ్‌కు తెలపకుండానే వారి అనుచరులకు ఇచ్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయం ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసికెళ్లినా లాభం లేకుండా పోయిందనీ శ్రీనివాస్ అనుచరులు విమర్శిస్తున్నారు
ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ మంజుల, ఆమె భర్త శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లేదని తెలుస్తుంది. మండలంలోని బీఆర్‌ఎస్ నాయకులను ఒకటిచేసే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థి తీసుకుంటే సమస్య జఠిలం కాకుండా ఉండొచ్చని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఒక వేళ వారు కనుక బీఆర్‌ఎస్‌కు దూరం అవుతే దీని ప్రభావం మిగతా మండలాల పైన పడి బీఆర్‌ఎస్‌కు ఎదురీదే పరిస్థితి రావచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ద్యావనపల్లి పార్టీని వీడతారా? లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? అనేది ఇంకా తెలియ రావడం లేదు. రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగిన రసమయి మానకొండూర్ నియోజక వర్గంలో గట్టి పట్టునే సాధించారు. కానీ ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి బలమయిన అభ్యర్థులు ఉండటం,పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిని ఎలా ఎదుర్కొని విజయం సాధిస్తారో నని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.