Saturday, July 5, 2025

Telangana Political : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అంటే ఇదే..

  • రాజకీయాల్లో పరిస్థితులు ఎపుడూ ఒకేలా ఉండవు

Telangana Political : కరీంనగర్ ప్రతినిధి (జనతా న్యూస్): శ్రీరామ నవమి వేడుకల్లో పానకం కోసం ఎగబడినట్టు ఎందరో ఆశావహులు పార్టీ టిక్కెట్టు కోసం పోటీలు పడుతున్నారు. ఫలానా నియోజక వర్గంలో ‘నేనైతేనే పక్కా గెలుస్తా’ అని మీడియా ముందు ఢంకా బజాయిస్తున్నారు. కొందరైతే దిష్టి బొమ్మలు తగలేసి మీడియా గొట్టాల ముందు కరుణ రౌద్ర రసాలు ప్రదర్శిస్తున్నారు.కొందరు యూ ట్యూబ్ ఛానళ్ల ముందు తమ కంటే గొప్ప సేవకులు లేరని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తమ అనుచరగణంతో ఎదుటి పక్షం మీద నీలి వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. అంధ రాజకీయ భక్తులు అన్ని పార్టీల్లో ఉండొచ్చు. కానీ ఏకాదశి పప్పు బెల్లాల కోసం అంధ భక్తుల స్థుతులు నమ్మి గతాన్ని విస్మరిస్తే… ఆ నాయకుడి పుట్టమునుతారు. ‘నేను మునిగినా ఫర్వాలేదు కానీ పక్కవాడు మునిగితే బాగు దేవా ’ అనుకునే మహర్జాతకులు ఒక్కొక్క సారి రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతారు.

జాతీయ స్థాయి ఎన్నికల్లో మహామహులే ఎన్నికల కురుక్షేత్రంలో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అపజయం మూట కట్టుకున్నారు. రాజ్ నారాయణ మీద పోటీ చేసిన దేశప్రధాని ఇందిరాజీ, నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో కీలక నిపుణుడిగా పని చేసిన కే ఎల్ రావు విజయవాడ పార్లమెంట్ స్థానంలో సాధారణ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ సింహ గర్జన చేసిన ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజక వర్గంలో చిత్తరంజన్ దాస్ అనే యువనాయకుడి చేతిలో ఓడిపోయారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భీష్మ పితామహుడు లాంటి సీనియర్లు, మీసం మెలేసిన నాయకులు ఓడిపోయారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కుందూరు జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రాజగోపాల్ రెడ్డి , మహిళ అయినప్పటికీ మంచి కార్య దక్షురాలు పద్మావతి,పీసీసీ అధ్యక్షుడిగా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ .కృష్ణయ్య ఎన్నికల బరిలో ఓటమి చవిచూశారు. ప్రస్తుత పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గా అనేక మార్లు గెల్చి ఓడిపోయారు. చెల్లని రూపాయ ఎక్కడైనా చెల్లదని టీఆర్ఎస్ అగ్ర నాయకుడు కేటీఆర్ ఢంకా బజాయించి మొత్తుకున్నా రేవంత్ మల్కాజిగిరి ఎంపీగా గెలిచాడు. నిజామాబాద్ లో ఎంపీ స్థానం నుంచి ఓడిన చెల్లెమ్మ కవితను ను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా కేటీఆర్ గారు గెల్పించుకున్నారు. చెల్లని రూపాయ అనే ప్రచారం ఇక్కడ చేయలేదు.

గెలుపు ఓటములు కాలమాన పరిస్థితుల్లో మారుతుంటాయి. ఓట్ల లెక్కలు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన యువకిశోరం బల్మూరి వెంకట్ కు 2 వేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈటల రాజేందర్ మీద టీఆరెఎస్ అధినాయకుడి తీరు పట్ల అక్కడ ఓటర్ల స్పందన ఈటల రాజేందర్ పట్ల బలంగా ఉండటం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అటు వైపు మళ్ళారు అనే సత్యం మరువద్దు. రేపు జరుగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లే హుజురాబాద్ లో వస్తాయని అనుకుంటారా…?!

అధికార టీఆరెఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆరెఎస్ పార్టీలోకి వలసలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రాన్ని డోలాయమానంగా మార్చేశాయి.ఆయారాం, గయారాం రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న చాల మందికి టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అలుకలు, తొడగొట్టే రెబల్స్ తో కాంగ్రెస్ పార్టీలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. వనపర్తి లో మాజీ మంత్రి చిన్నా రెడ్డి కాంగ్రెస్ పక్షాన పోటీ కోసం, హస్తిన దాకా ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

అంతో ఇంతో మంచి పేరు తప్ప కోట్లు లేని ఆయనకు – ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా భావిస్తున్న పెద్ద మందడి ఎంపిపి రెబల్ బాధ తప్పేట్టు లేదు. ఆయన వర్గం ఊరేగింపులు నిరసనలు చేపట్టారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన నియోజక వర్గంలో అభివృద్ధి జరుగలేదని, అధికార టీఆరెఎస్ ప్రభుత్వం మీద అలిగి రాజీనామా చేసి అదే మునుగోడు లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడం ఒక రాజకీయ వింత… తను ఓడిపోయిన ఆ నియోజకవర్గం నుంచి,ఉప ఎన్నికల సందర్భంగా గోడల మీద రాసిన రాతలు చెరగముందే 2023 నవంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి దిగుతున్నారు. బిజెపి లో ఉన్న వివేక్ కు కాంగ్రెస్ పార్టీలో సీట్లు రిజర్వ్ అయ్యాయి.
ఇదికదా ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవడమంటే..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page