- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హెచ్చరిక
కరీంనగర్, జనతా న్యూస్ : మీడియా పేరుతో ఎలాంటి గుర్తింపులేని పత్రికలు, యూట్యూబ్ ఛానెల్స్ ఐడి కార్డులు సృష్టించి, పవిత్రమైన జర్నలిజాన్ని అపవిత్రత పాలు చేస్తున్న అసాంఘిక శక్తులకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు హెచ్చరిస్తూ ఒక ప్రకటనను జారీ చేశారు. జర్నలిజం పట్ల ఎలాంటి అవగాహన లేని అసాంఘిక శక్తులు, జల్సాలకు అలవాటుపడి, అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి జర్నలిస్టులుగా చెలామణి అవుతూ సమాజంలో సృష్టిస్తున్న అలజడి సహించారనిదని అన్నారు. ఇటీవల మెదక్ జిల్లా నార్సింగ్ లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నకిలీ విలేకరుల ముఠాను పట్టుకొని వారికి సంఘం సరైన గుణపాఠం చెప్పిందని గుర్తు చేశారు. అక్షరం ముక్క కూడా రాయలేని ఈ అసాంఘిక శక్తులు, జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడుతూ పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ, మిడిదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి రాజు అనే యువకుడి జేబులో ఏకంగా 5 మీడియా ఐడి కార్డులు దొరకడం విస్మయానికి గురి చేస్తుందని అన్నారు. అవన్నీ నకిలీ- మీడియా సంస్థలు సృష్టించిన ఐడీ కార్డులే నని అన్నారు. జర్నలిస్టుల ముసుగులో ప్రతి గ్రామంలో ఇలాంటి అసాంఘిక శక్తులు పుట్టుకురావడం సమాజానికి పెనుప్రమాదంగా భావిస్తున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే, జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవం, విలువలు మంట కలిసి పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే సంఘం తగు కార్యాచరణ రూపొందించి, జర్నలిజం వృత్తిలో మొలుస్తున్న ఇలాంటి కలుపు మొక్కలను ఏరివేసే చర్యలకు పూనుకోబోతుందని హెచ్చరించారు.