మంథని, జనతా న్యూస్: వేద విద్యలకు పట్టుకొమ్మ అయిన మంత్రపురి అగ్రహారంలో నవంబర్ 2 నుంచి 5 వరకు తెలంగాణ వేద విద్వన్మహా నిర్వహించనున్నారు. శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారామ సేవా సదన్, మంథని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 23వ విద్వన్మహా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తెలంగాణ లో క్షీణిస్తున్న వేద విద్యకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు 2002 లో జనార్ధనానంద సరస్వతి స్వామి ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జరిగిన 22 వార్షిక వేద సభలు నిర్వహించారు.
ద్వారకా పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి స్వామి, కంచి సర్వజ్ఞ పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, నృసింహ భారతి స్వామి, సచ్చిదానంద సరస్వతి స్వామి, కృష్ణానంద సరస్వతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామి, చిన జీయర్ స్వామి, సద్గురు శివానందమూర్తి వంటి మహానుభావులతో విద్వన్మహా సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. నవంబర్ 2న నిర్వహించే సభలకు 150 మంది వేద విద్వాంసులు, 450 మంది వేద విద్యార్థులు హాజరుకానున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు గట్టు నారాయణ గురూజీ, కెవిఎల్ ఎన్ హరిబాబు, దుద్దిల్ల గణపతి, నల్లగొండ హరి, పల్లి ప్రహ్లాదులు తెలిపారు.
నాలుగు రోజుల పాటు వేద విద్వాంసులు సంపూర్ణ శుక్ల యజుర్వేద స్వాహాకార హవనము వేద స్వస్తి నిర్వహించనున్నారు. ప్రముఖ వేద శాస్త్ర పండితులచే ఉదయం ఉపనిషత్ ఉపనిషత్భాష్య ప్రవచనములు, అలాగే సాయంత్రం పండిత గోష్టి బహిరంగ సభ నిర్వహించబడునని వారు తెలిపారు. 5 వ తేదీ ఆదివారం వేద విద్వాంసులకు, విద్యార్థులకు సత్కారం చేయనున్నట్లు కర్నే హరిబాబు తెలిపారు. మంథని పట్టణంలోని నృసింహ శివ కిరణ్ గార్డెన్ లో ఈ సభలు నిర్వహించనున్నారు.