-ఇబ్బందులు పడుతున్న జనం
హైదరాబాద్, జనతా న్యూస్: ఉప్పల్ ఫిర్జాది గుడా మునిసిపల్ కార్పొరేషన్ ఆవరణ లోని ఆధార్ నమోదు కేంద్రంలో సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉదయమే నమోదు కేంద్రానికి వెళ్లిన ప్రజలకు నిరాశే ఎదురయింది.పండుగ సీజన్ కావటంతో నమోదు కేంద్రాలలో రద్దీ పెరిగింది.దీనికి తోడు ఆధార్ కేంద్రంలోని కొంత మంది సిబ్బంది మొదట వచ్చిన వారి లిస్ట్ తయారు చేసారంటూ ఓ లిస్టును తయారు చేసి నమోదు కేంద్రంలోని ఆపరేటర్ కు అందచేశారు.ఈ విషయం తెలుసుకున్న మరి కొందరు వినియోగదారులు గొడవకు దిగారు.సిబ్బంది లోని కొంతమందే కుమ్మక్కు అయి ఇలా తమవారి బంధువులు,స్నేహితుల పేరుతో లిస్ట్ తయారు చేశారని అక్కడవున్న వినియోగదారులు తీవ్రంగా అడ్డుకున్నారు.
లిస్టులో పేరున్నవారు ఇదే అదనుగా భావించి మిగితా వారితో గొడవకు దిగారు.వారికి అక్కడి సిబ్బంది వత్తాసు పలకడంతో అక్కడ ఉన్నవారు విస్తుపోయారు. ఆపరేటర్ పండుగ తర్వాతే ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులు జరుగుతాయని,సర్వర్ కూడా డౌన్ అయ్యింది అంటూ చెప్పి తుర్రుమని ఓ బైక్ పై వెళ్లి పోవటంతో ఆధార్ కేంద్రం వద్ద వేచి ఉన్నవారు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఆపరేటర్ సిస్టం ఓపెన్ చేయకుండానే ఇలా చెబుతున్నారని అక్కడ ఉన్న వినియోగదారులు అరోపించారు.
కనీసం సిస్టం ఓపెన్ చేసి పదినిమిషాలు కూడా వేచిచూసిన పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు.ముందుగా వచ్చిన వారి లిస్ట్ అంటూ కొంత మంది ఆఫీసులో ని వారు లోకల్ వారితో కుమ్ముక్కై ఇలా తయారు చేస్తున్నారని జనమంతా వెళ్లి పోయాక తమవారికే సేవలు అందిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి.ఆధార్ నమోదు కేంద్రంలో సరైన నియమనిబంధనలను కూడా పాటించటం లేదని ఆరోపణలు వున్నాయి.అక్కడికి వచ్చిన వారికి కనీస సూచనలు కూడా ఎవ్వరూ చేయటం లేదని వాపోతున్నారు.ఇలాంటి పరిస్థితి ఉండటం తో నమోదుకోసం. వచ్చిన వారి మధ్య గొడవలకు దారి తీస్తోంది.నమోదు కేంద్రం వద్ద కూడా భాద్యులను నియమించక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
గతంలో జీహెచ్ఎమ్ సీ ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు రోజుకు కనీసం 50 టోకెన్లు ఇచ్చే వారు.సమయం కూడా చెప్పి టోకెన్లను ఇవ్వటం తో ప్రజలకు కొంత సౌకర్యంగా క నిపించింది.ప్రస్తుతం కేవలం 20,25 టోకెన్లే ఇవ్వటం తో ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఏదిఏమైనా ఓ సరైన పద్ధతి పాటించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.