Vemulawada :తెలంగాణలో మహిళల అతిపెద్ద పండుగ బతుకమ్మ. దాదాపు 10 రోజుల పాటు ఈ ఉత్సావాల్లో వీరు మునిగిపోతారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు బతుకమ్మను పేరుస్తూ సాయంత్ర కూడళ్లల్లో అందరూ కలిసి ఆడుతారు. 9వ రోజు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. తెలంగాణ వ్యాప్తగా సాధారణంగా జరిగే వేడుకలు ఇవి. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మాత్రం 7వ రోజు నాడే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. అలా నిర్వహించడానికి ఓ పురాణ గాథ ఉంది. అదేంటంటే?
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ రాజు తన కుమార్తెను వేములవాడకు చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. బతుకమ్మ పండుగ రావడంతో పుట్టింటికి రావాలని తండ్రి కోరుతాడు. కానీ వేములవాడలో కూడా బతుకమ్మ పండుగ ఉంది కదా.. పుట్టింటికి ఎలా రాను? అని కూతురు అంటుంది. దీంతో ఆ రాజు వేములవాడలోని వారు 7 రోజులకే మెట్టింట్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకొని ఆ తరువాత 9వ రోజు పుట్టింట్లో నిర్వహించుకోవాలని ఆదేశించాడట. అప్పటి నుంచి 7వ రోజునే ఇక్కడ సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారన్న ప్రచారం ఉంది. 2023 సద్దుల బతుకమ్మ వేడుకలను అక్టోబర్ 20న నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చేశారు.