Saturday, July 5, 2025

మీడియాపై పాలకుల ధోరణి మారాలి

 వారం వ్యవధిలో ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు

 కేసులపై పునరాలోచించక పోతే ఆందోళన తప్పదు

 పతనం ప్రారంభమైన వారే ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారు

 టియుడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరు శేఖర్

కరీంనగర్, జనతా న్యూస్ ప్రతినిధి:  మీడియాను అణగదొక్కకపోతే, తమ ఉనికికే ప్రమాదమనే భావనలో పాలకులు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అన్నారు. ఈ కారణంగానే రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, దానితో ముడిపడి ఉన్న పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగే రోజులు వచ్చాయన్నారు.గురువారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగిన టియుడబ్ల్యూజే సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మీడియాను అణచివేసే విధానాలు ప్రస్తుతం బుల్డోజర్ స్థాయికి పెరిగిపోయాయన్నారు. నాయకులు బలహీనులై, తమ పతనం ప్రారంభం అయ్యిందని ఎప్పుడు భావిస్తారో, అప్పుడు బుల్డోజర్ సంస్కృతి అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో కరీంనగర్ జర్నలిస్టులు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని దుస్థితి దాపురించిందన్నారు. అయితే వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

పోరాటాలే ఊపిరిగా ఆరు దశాబ్దాల కాలం ఈ సంఘం ముందుకు సాగుతున్న విషయాన్ని జర్నలిస్టులపై కేసులు నమోదు చేసేవారు, చేయించేవారు గుర్తుంచుకోవాలన్నారు. ఇవేమీ తమకు కొత్త కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న గౌరవం, నమ్మకంతోనే ఎన్నికల నిబంధనావళికి లోబడి గురువారం తాము చేపట్టిన ఆందోళనను సభ్యుల వరకే పరిమితం చేశామన్నారు. అంతమాత్రాన వెనకడుగు వేసేది లేదని, ఒక అడుగు వెనక్కి వేస్తే, నాలుగు అడుగులు ముందుకు పడినట్టే అన్నారు. వారం రోజుల వ్యవధిలో కరీంనగర్ పట్టణంలో ముగ్గురు జర్నలిస్టులపై పెట్టిన కేసుల పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసుల విషయంలో పోలీసు యంత్రాంగం పునరాలోచించాలని, పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు.

యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, జానంపేట మారుతి స్వామి, ఉపాధ్యక్షుడు ఒంటెల కృష్ణ, యూనియన్ నేతలు ఎంఏ ఆసద్, రమేష్, కొండల్ రెడ్డి, సందీప్ కుమార్, టి యు డబ్ల్యూ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, 18 మండలాలకు చెందిన 100 మంది సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page