ఏజెన్సీలు మారినా నిర్వాహకుడోక్కడే..
అరకొర వేతనాలు..నెలల తరబడి పెండిరగ్
పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అవక తవకలు
ప్రభుత్వాలు మారినా మారని తీరు..
కరీంనగర్ టీచింగ్ ఆసుపత్రిలో అక్రమాలు !
కరీంనగర్ -జనత న్యూస్
ప్రభుత్వాలు మారినా, శ్రమ దోపిడీ తగ్గలేదు..పైగా పెరిగింది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయినా..వ్యవస్థలో మార్పు రాలేదు. అవినీతి, అక్రమాలు యథేచ్చగా జరుగుతున్నట్లు విమర్శలున్నాయి. ఇందుకు సానిటేషన్ విభాగం ఉదాహరణ. సుమారు తొమ్మిదేళ్లుగా ఒకే ఒక్కడు ఇక్కడ రాజ్యమేలుతున్నాడు. పారిశుధ్య కాట్రాక్టు పనుల్లో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తొలుత స్ఫార్క్, ఆ తరువాత ఎజిల్ ఏజెన్సీ..పేరు మారినా నిర్వాహకుడు మాత్రం ఆయనే. ఇష్టారీతిన నియామకాలు, వేతనాల చెల్లింపులు చేస్తూ..కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నాడు. పీఎఫ్, ఈఎస్‌ఐలో గోల్‌మాల్‌కు పాల్పడుతున్నాడు. వీటిపై వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక, పీఎఫ్ అధికారులెవరూ చర్యలు తీసుకోక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
9 ఏళ్లుగా పీఎఫ్ పక్కదారి ?
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పాలన పక్కదారి దారి పట్టింది. పారిశుధ్య కాట్రాక్టు ఏజెన్సీపై ప్రభుత్వ పర్యవేక్షణ లేక పోవడం వల్ల అనేక అవక తవకలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రతీ నెలా కార్మికుల వద్ద నుండి రూ. వెయ్యి వరకు పీఎఫ్ కట్ చేస్తున్నా..వారి ఖాతాలో జమ కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇలా ఆసుపత్రిలోని సుమారు 250 మంది కార్మికుల్లో కొద్ది మంది కార్మికులకు మినహా, మిగతా వారి ఖాతాల్లో పీఎఫ్ జమ చేయడం లేదు. కార్మికుని వాటాతో యాజమాన్యం మరో రెండు వేల రూపాయల చొప్పున పీఎఫ్ ఆఫీసులో జమ చేయాల్సి ఉండగా..సదరు కాంట్రాక్టరు చట్టాన్ని తుంగలో
తొక్కుతున్నాడు. స్ఫార్క్, ఏజిల్ సంస్థల ద్వారా సుమారు 9 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
దొడ్డిదారిన నియామకాలు
జిల్లా ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ప్రస్తుతం 542 పడకలు ఉన్నాయి. ఇందులో పేషెంట్ కేర్, సానిటేషన్, సెక్యూరిటీ గార్డులుగా 250 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలో పని చేసే కార్మికులను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నియామకాలు చేసుకోవాల్సి ఉండగా..ఇక్కడ మాత్రం కాట్రాక్టరు ఇష్టారాజ్యంగా నియామకాలు చేపడుతున్నారు. ఒక్కో కార్మికుని వద్ద దళారీలు రూ. లక్ష వరకు వసూలు చేసి నియామకం చేయిస్తున్నట్లు ఆరోపనలున్నాయి. కార్మికుల జాబితా, వారికి చెల్లిస్తున్న వేతనాలు..అంతా రహస్యమే. వారథి, ఇతర ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరుగాల్సి ఉండగా..ఇక్కడ ఆ నిబంధనలేమీ పాటించడం లేదు.
తొమ్మిదేళ్లు ఏం జరిగింది..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టు టెండరు ప్రతీ రెండు సంవత్సరాలకోసారి నిర్వహించాల్సి ఉంటుంది. కరీంనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కాంట్రాక్టు మాత్రం తొమ్మిదేళ్లుగా ఒక్కడికే ఎలా కేటాయించారనే దానిపై విచారణ జరుగాల్సి ఉంది. 2022 వరకు కాంట్రాక్టు కాల పరిమితిని పొడగించుకుని, ఆ తరువాత టెండరు ద్వారా సానిటేషన్ పనులు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
మూడు నెలలుగా వేతనాల్లేవు..
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య, పేషెంట్ కేర్, సెక్యురిటీ గార్డులుగా పని చేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. చెల్లించే అరకొర వేతనాలు సైతం కాంట్రాక్టరు చెల్లించక పోవడంతో కార్మికులు రోడ్డెక్కి ఆందోళణలు చేస్తున్నారు.దీనిపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. పెండిరగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాల జీవోలు అమలు చేయాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
కనీస వేతనాలు అమలు చేయాలి
బండారి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంట్రాక్టు కార్మిక సంఘం
జీవో నెం.11, 16 ప్రకారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులకు రూ. 15, 600 చొప్పున వేతనాలు చెల్లించాలి. నియామకాలు కూడా పారదర్శకంగా నిర్వహించాలి. ప్రతీ నెలా కార్మికునికి వేతన స్లిప్ ఇవ్వాలి. కార్మికుని వాటాతో పాటు యాజమాన్యం వాటా కలిపి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యేలా ఆసుపత్రి సూపరిండెంట్ చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత మేరకు ఆయా కార్మికుల్లో పీఎఫ్ జమ చేశారో స్పష్టత ఇవ్వాలి.