‘ పొన్నం ‘ తో హుస్నాబాద్ కు మంత్రిపదవి
(కరీంనగర్, జనతా న్యూస్)
అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట.. కమ్యూనిస్టులను అక్కున చేర్చుకున్న ‘ఎర్ర’ పతాక.. కరుడుగట్టిన కమ్యూనిస్టులు అక్కడ ఉండేవారు. నిజాంను ఎదురించి మందాపూర్ గుట్టల్లో అసువులు బాసిన ఎందరో స్ఫూర్తి ఇప్పటికీ ఉండేది. నక్సలిజం రాజ్యమేలేది. ఆసియాలోనే అతిపెద్ద స్థూపానికి హుస్నాబాద్ వేదికైంది. అయితే కాలం మారింది. నియోజకవర్గ పునర్విభజన జరిగింది. ఇందూర్తి నియోజకవర్గం కాస్త హుస్నాబాద్ గా మారింది. సీపీఐకి కంచుకోటగా ఉండి ఎందరో కమ్యూనిస్టు లీడర్లను ఇందూర్తి నియోజకవర్గం నిలబెట్టింది. ఆ తర్వాత మధ్యలో కాంగ్రెస్ ను ఆదరించింది.. అలాంటిది హుస్నాబాద్ గా మారాక ఇప్పుడు కమ్యూనిస్టుల స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాలు ఎగురుతున్నాయి. ఈసారి కరీంనగర్ నుంచి వచ్చిన యువ నేత ‘పొన్నం ప్రభాకర్’ తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కించుకోవడం విశేషం. ఎంతమంది కమ్యూనిస్టులు గెలిచినా వారి ప్రభుత్వం రాష్ట్రంలో రాలేదు. అందుకే హుస్నాబాద్ కు మంత్రి పదవి దక్కలేదు. దాదాపు 71 నిరీక్షణ తర్వాత హుస్నాబాద్ కు ఆ బాధ తీరింది. మంత్రి పదవి ఇన్నాళ్లకు దక్కింది. హుస్నాబాద్ మంత్రి పదవి ఆశపై స్పెషల్ ఫోకస్..
ఇందుర్తి నియోజకవర్గ కేంద్రంగా..
1971లో ఇందుర్తి నియోజకవర్గానికి మంత్రి పదవి లభించే అవకాశం వచ్చింది. అప్పుడు ఇందుర్తి నియోజకవర్గ కేంద్రంగా హుస్నాబాద్ ఉండేది. ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు వియ్యంకుడు బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇందుర్తి శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ అటు పీవీ నరసింహారావు (మంథని) ఇటు లక్ష్మీకాంతరావు (ఇందుర్తి) ఇద్దరూ కరీంనగర్ జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, పైగా ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం, బంధువులు కూడా కావడంతో లక్ష్మీకాంతారావుకు మంత్రి పదవి అందకుండా పోయింది. అలా మొదటిసారి హుస్నాబాద్ ప్రాంతానికి అమాత్య యోగం తప్పిపోయింది.
దశాబ్దాల కాంగ్రెస్ కంచుకోటను బద్దలు చేస్తూ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1983 లో జరిగిన ఎన్నికలలో ఇందుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొప్పరాజు లక్ష్మీకాంతారావు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి తప్పకుండా ఆయన మంత్రి అవుతారని నియోజకవర్గంలోనే కాకుండా, జిల్లాలోనూ ప్రచారం జరిగింది. కానీ, దశాబ్దాల కాంగ్రెస్ కంచుకోటను బద్దలు చేస్తూ ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెండోసారి కూడా నియోజకవర్గానికి మంత్రి పదవి అందకుండాపోయింది.

కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు..
1989 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఇందుర్తి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు బొమ్మ వెంకన్న పోటీ చేశారు. కానీ, స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూశారు. నిజానికి ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న బొమ్మ వెంకన్న ఓట్ల లెక్కింపులో మొదటి నుంచీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి రౌండులలో సీపీఐ అభ్యర్థి దేశిని చినమల్లయ్య ముందుకు దూసుకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. ఆనాడు బొమ్మ వెంకన్న గెలిచి ఉంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, బీసీ నాయకుడిగా, సంఘసేవ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి లభించి ఉండేది. కానీ, ఆయన ఓటమి నియోజకవర్గానికి మంత్రి పదవిని దూరం చేసింది.
2009లో హుస్నాబాద్ నియోజకవర్గంగా..
2009లో ఇందుర్తి నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గంగా మారింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. బెజ్జంకి మండలం మానకొండూరులో కలిసింది. ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షుడుగా ఉన్న అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంథని శాసన సభ్యుడుగా ఉన్న శ్రీధర్ బాబుకు మంత్రి పదవి దక్కింది. ఇద్దరూ అగ్రవర్ణాల వారే కావడం, ప్రవీణ్ రెడ్డి కూడా ఆ వర్గానికి చెందినవారే కావడంతో ఈసారి కూడా హుస్నాబాద్ కు పదవి అందని ద్రాక్ష పండే అయింది.
కేసీఆర్ నాయకత్వంలో ..
2014– 2018లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వొడితెల సతీశ్ బాబు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలోనూ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సతీశ్ బాబు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుమారుడు కావడంతో ఆయనకు మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించారు. ఈ రెండు ప్రభుత్వాలలో ఈటల రాజేందర్, కేటీ రామారావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు కావడంతో, రాజకీయ సమీకరణాలు కుదరక సతీశ్ బాబుకు అవకాశం లభించలేదు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గానికి మరోసారి నిరాశ తప్పలేదు.
హుస్నాబాద్ నియోజకవర్గం దశ–దిశను మార్చేశాయి..
2023 ఎన్నికలు హుస్నాబాద్ నియోజకవర్గం దశ–దిశను మార్చేశాయి. ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడంతో బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని అనుకున్నారు. కానీ, సరిగా ఎన్నికలకు ముందు ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో బొమ్మ శ్రీరామ్ అసహనానికి గురయ్యారు. అదే సందర్భంలో బీజేపీ కాస్త రైజింగులో కనిపించడం, కాంగ్రెస్ తనను అభ్యర్థిగా ప్రకటిస్తుందో లేదో అనే అనుమానంతో బొమ్మ శ్రీరామ్ బీజేపీలో చేరిపోయారు. ఇక ప్రవీణ్ రెడ్డికి లైన్ క్లియర్ అని అంతా భావిస్తున్న తరుణంలో, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందరితో సంప్రదింపులు జరిపి, సలహాలు స్వీకరించి, అందరినీ ఒప్పించి మరీ ఆయన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. యంగ్, డైనమిక్, ఉద్యమకారుడు కావడంతో గెలుస్తాడనే నమ్మకంతో చివరికి కాంగ్రెస్ అధిష్టానం ప్రభాకర్ కే టిక్కెట్టు కేటాయించింది. హుస్నాబాద్ నియోజకవర్గం ఆయనను మంచి మెజారిటీతో శాసనసభకు పంపించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రిగానూ అవకాశం కల్పించింది. 71 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హుస్నాబాద్ ప్రాంతానికి అమాత్య పదవి వరించింది.
తెలంగాణ ఉద్యమంలో చరుకైన పాత్ర..
వైఎస్ఆర్ ప్రోద్బలంతో ఎన్ఎస్.యూఐ నేతగా.. యూత్ కాంగ్రెస్ లో ఉన్న పొన్నం ప్రభాకర్ 2009లో కరీంనగర్ ఎంపీగా గెలుపొంది, తెలంగాణ ఉద్యమంలో చరుకైన పాత్రను పోషించారు. ఇపుడు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యారు. ఆయన నేతృత్వంలో హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ప్రభాకర్ చేయాల్సిన మొదటి పని ముక్కలు చెక్కలైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి కరీంనగర్లో కలపడం, హుస్నాబాద్ కు వరప్రదాయినులుగా ఉన్న గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను వెనువెంటనే పూర్తి చేసి ఇక్కడి భూములకు సాగునీరు అందించేలా చూడడం. ముఖ్యమైన పనులు ముందుగా పూర్తయితే ఆయన ఈ ప్రాంతం మరవని నాయకుడుగా నిలిచిపోతారంటంలో ఎలాంటి సందేహం లేదు