కరీంనగర్ జిల్లాలో..
రూ. 194.64 కోట్లు మాఫీ
బ్యాంకర్లకు కలెక్టర్ దిశా నిర్ధేశం
కరీంనగర్-జనత న్యూస్
రైతు రుణమాఫీ పథకంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 35, 686 రైతు కుటుంబాలకు సంబంధించిన 37,745 బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.194.64 కోట్ల రూపాయలు జమ చేయనుందని తెలిపారు. రైతులతో మర్యాదగా వ్యవహరించాలని, నిర్లక్ష్య వైఖరి అవలంభించ రాదని బ్యాంకు అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎంక్వైయిరీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాల యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఏడీని ఆమె ఆదేశించారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. రైతుల రద్దీ ఏర్పడనున్న దృష్ట్యా బ్యాంకుల్లో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎల్డిఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి బత్తుల శ్రీనివాస్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ రావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, బ్యాంకర్లు, పాల్గొన్నారు.