Thursday, September 19, 2024

134 రకాల టెస్టులు ఫ్రీ !

హీమోగ్లొబిన్‌ నుండి క్యాన్సర్‌ వరకు..
టీ హబ్‌ ల్యాబ్‌లో రక్త పరీక్షలు
కరీంనగర్‌ జిల్లాలో రోజుకు 1200 వరకు టెస్టులు
అత్యంత ఆధునిక పరికరాలు, నిపుణులైన డాక్టర్లు
కరీంనగర్‌- జనత న్యూస్‌

‘‘ అనారోగ్యంతో బాధ పడుతున్నారా..? పరీక్షలు, చికిత్సకు డబ్బుల్లేవని ప్రయివేటు ఆసుపత్రికి వెల్లలేక పోతున్నారా..? ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయరనే అపోహలో ఉన్నారా..?’’ ఏమాత్రం దిగులు పడకండి పడకండి..వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికెళ్లండి ! అన్ని రకాల రక్త`మూత్ర పరీక్షలతో పాటు వైద్య సేవలు కూడా ఉచితంగా పొందండి. కరీంనగర్‌ జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ప్రత్యేక యంత్రాంగం నిరంతరం పని చేస్తోంది.

చిన్న జ్వరమొచ్చినా..టెస్టులు, మందులు పేరుతో రూ. వెయ్యి నుండి కనీసం రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు కొందరు ప్రయివేటు ఆసుపత్రుల డాక్టర్లు. పేద, మధ్య తరగతి వర్గాలకు నెల జీతం మొత్తం ఈ ఒక్కరోజుతోనే ఖర్చవుతుంది. దీంతో అప్పులు చేయాల్సి వస్తోంది. వర్షాకాలం స్లమ్‌ ఏరియాల్లోని పేదలు ఎక్కువగా సీజనల్‌ వ్యాధులకు గురౌతున్నారు. వైద్యం చేయించుకోక అప్పుడప్పుడు మృతి చెందుతున్న సంఘటనలూ ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్‌ ఫీవర్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. ఇక నుండి ఏ చిన్న జబ్బు చేసినా నిర్లక్ష్యం చేయకండి. ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించండి. ఒక్కరూపాయి ఖర్చు లేకుండా టెస్టులు, చికిత్స అందుబాటులో ఉంది.

జిల్లాలోని 29 సెంటర్లలో పరీక్షలు
కరీంనగర్‌ జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా వైద్య కళాశాల ఆసుపత్రి..ఇలా మొత్తం 29 ఆసుపత్రుల్లో 134 రకాల టెస్టులు చేస్తున్నారు. ఆయా సెంటర్లలో లాబ్‌ టెక్నిషియన్లు అందుబాటులో ఉన్నారు. డాక్టర్‌, సిబ్బంది సూచనల మేరకు రోగి వద్ద బ్లడ్‌ షాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యహ్నాం వరకు సేకరించిన షాంపిల్స్‌ను జిల్లా కేంద్రంలోని టీ`హబ్‌ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఆయా అధునాథన మిషన్ల ద్వారా పరీక్షలు చేసి ఆన్‌లైన్లో రోగి సెల్‌నెంబర్‌కు రిపోర్ట్స్‌ పంపుతున్నారు డాక్టర్లు.

134 రకాల టెస్టులు ఫ్రీ
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన టీ`హబ్‌ ల్యాబ్‌కు రోజుకు సుమారు 1200 వరకు షాంపిల్స్‌ వస్తున్నాయి. ఇక్కడ సిబ్బందితో పాటు పాథలాజిస్టులు, మైక్రో బయాలజిస్టులు మిషన్ల ద్వారా రక్త పరీక్షలు చేసి, ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందులో హీమొగ్లోబిన్‌ నుండి క్యాన్సర్‌ నిర్ధారించే సీఏ`125, సీఈఏ వరకు అంత్యంత ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో కొన్ని సెలెక్టెడ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంపు నిర్వహించి క్యాన్సర్‌, ఇతర వ్యాధుల నిర్ధారణ టెస్టులూ నిర్వహిస్తున్నారు.

ప్రయివేటు ల్యాబ్‌ల వ్యాపారం !
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో కార్పోరేట్‌, ప్రయివేటు ల్యాబరేటీలు..ఇండ్లల్లోకి వచ్చి షాంపిల్స్‌ సేకరిస్తున్నాయి. కలర్‌ఫుల్‌ కరపత్రాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా జిల్లాలో ప్రయివేటు ల్యాబ్‌ల ద్వారా రోజుకు రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. కొందరు ప్రయివేటు డాక్టర్లు సైతం..కమీషన్లు వచ్చే ల్యాబ్‌ లకే రోగ నిర్ధారణ టెస్టులు రాస్తున్నారు. వీరి భారిన పడడం కంటే..ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించడం ఉత్తమం. అయితే టెస్టుల్లో రిపోర్టులను బట్టి కొన్ని సందర్భాల్లో ప్రయివేటు డాక్టర్లను సంప్రదించి చికిత్స పొందాలి. గుండె, లివర్‌, తదితర ప్రత్యేక నిపుణుల వైద్య సేవలు అవసరమైతే ..ప్రత్యేక పరిస్థితుల్లో సేవలు తీసుకోవాలి.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఉచిత సేవలను మాత్రం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, రూపాయి ఖర్చు లేకుండా 134 రకాల ప్రభుత్వ లాబ్‌ టెస్టులతో పాటు వైద్య సేవలు పొందాలని, పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు. అధికారుల సూచనలతో పాటు జనత న్యూస్‌ కథనంతోనైనా పేదలు టీ`హబ్‌ ల్యాబ్‌ సేవలు ఉచితంగా పొందుతారని ఆశిద్ధాం !

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page