- రసవత్తరంగా మారిన మంథని ఎన్నికలు
- ప్రజాదరణను నమ్ముకున్న కాంగ్రెస్ అభివృద్ధిని సంక్షేమ ఫలాలను సేవ కార్యక్రమాలను నమ్ముకున్న బిఆర్ఎస్
- సర్వేలు ఎవరికి అనుకూలం?
మంథని, జనతా న్యూస్
మంథని నియోజకవర్గము ఎవరికి అడ్డాగా మారిందో ఉత్కంఠత నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య రసవత్తర పోరు సాగుతుందని కాంగ్రెస్ కంచుకోటగా ముద్రపడ్డ మంథనిలో ఏ పార్టీ జెండా ఎగర పోతుందో అన్న చర్చ సర్వత్ర ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏ ఇద్దరు కలిసిన అన్న ఎవరు గెలుస్తారే! అనే మాటలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ బరిలో సర్వశక్తులు ఒడ్డీ అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రజాధరణను నమ్ముకొని కాంగ్రెస్, క్యాడర్ ను బహుజన వాదాన్ని నమ్ముకుని బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ మధ్య సర్వేలు నిర్వహించిన కొన్ని సంస్థల అంచనాల ఫలితాలు కాంగ్రెస్ వైపే మొగ్గు ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. సర్వే ఫలితాల్లో వచ్చిన ఫలితాలు నిజమవుతాయా లేదా అనేది పక్కన పెడితే అభ్యర్థుల గెలుపోటముల గురించి ప్రజల్లో చర్చ మొదలయింది. అయితే ఈసారి గెలుపును ఛాలెంజ్ గా తీసుకున్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా ప్రచారంలో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం మంథనిలో ఎన్నికలవేళ ఫలానా వారు గెలుస్తారని చెప్పలేని అస్పష్టమైన పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీడియా సంస్థలు, ప్రసార సాధనాల ద్వారా ప్రచారం జరుగుతుండడంతో . ఓటు వ్యర్థం కాకుండా గెలిచే అభ్యర్థికే ఓటు వేయాలనే విషయంలో తర్జనభజన పడి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఓటర్లు తమ మనో గతాన్ని వెల్లడించడంలో దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు 24 గంటలు కరెంటు ఇచ్చే పార్టీ కావాలా? మూడు గంటలు ఇచ్చే పార్టీ కావాలా? అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ అంటూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఆరు నూరైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎందరు పోటీలో ఉన్న గెలుపు తనదే అనే ధీమాతో ఉన్నారు. బిజెపి బిఎస్పి అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తూ ప్రజల వద్దకు వెళుతున్నారు. అభ్యర్థులు తెల్లవారు మూడు గంటల వరకు గ్రామాల్లో, మండలాల్లో పర్యటిస్తున్నారంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈనెల 30న జరిగే పోలింగ్ లో ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో, డిసెంబర్ 3న ఎవరికి మంథని గడ్డ ఎవరికి అడ్డ కానుందో వేచి చూడాలి.