Friday, September 12, 2025

*నరక కూపం!

 

– అధ్వానంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణపనులు

-కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రయాణికులకు చుక్కలు

– కళ్లల్లో దుమ్ము.. పొంచి ఉన్న ముప్పు

– శ్వాస తీసుకోవడానికే ఇబ్బందులు

– నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు !

కరీంనగర్, జనతా న్యూస్ : కరీంనగర్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇది కూడా ఒకటి. దీంతో రాకపోకలు రద్దీగా మారాయి. అన్ని రహదారులు కిటకిటలాడుతున్నాయి. అయితే ఎన్నో మైళ్లు ప్రయాణం చేసిన వాహన చోదకులు రైల్వే స్టేషన్ సమీప్పిస్తుంది అనిపిస్తేనే హడలి పోతున్నారు . ఎందుకంటే అన్ని మైళ్ల ప్రయానం ఒక ఎత్తైతే ఇక్కడి రైల్వే గేట్ దాటడం ఒక ప్రహసనమే అనడం అతిశయోక్తి కాదు. వివరాలు ఇలా వున్నాయి.

నగరానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వల్ల బ్రిడ్జి లేక వాహనదారులు నిత్యం తిప్పలు ఎదుర్కొంటున్నారు. సమీపంలోనే ఆస్పత్రులు ఉండటంతో గేటు పడితే గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలు సైతం గాల్లో కలుస్తున్నాయి. ఈనేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరాన్ని గుర్తించిన కేంద్రం సేతుబంధు పథకం కింద బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు సంకల్పించింది. దీనికిగాను రూ.154.74 కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జులై 13, 2023లో పనులు ప్రారంభించింది. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ మేరకు పనులు ప్రారంభించారు.

దమ్ము తీయనీయకుండా దుమ్ము

కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటూ డంబికలు పలికే ఇక్కడి నేతలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ఇలాంటి అప్రోచ్ రోడ్డు (సర్వీస్ రోడ్) వేయకుండానే నిర్మాణ పనులు సాగిస్తున్నా చోద్యం చూస్తున్నారు. రోడ్డు గుంతలమయంగానే గాకుండా పూర్తి అధ్వానంగా ఉండడంతో రోడ్డు మీద వెళ్లే వాహన చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు అంతే కాకుండా దుమ్ము రోడ్డంతా వ్యాపిస్తోంది. ప్రయాణికులు దుమ్ములోనే శ్వాస తీసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వాహనదారులు ముక్కుమూసుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనిపై ఎంత మొత్తుకున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు.సదరు గుత్తేదారుకు ఆ ఊసే లేదు. సంవత్సరంలోగా పూర్తి చేస్తామని హామీలు ఇచ్చిన అది సాధ్యం కాదు అని తెలుస్తుంది. అడిగేవాళ్లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. బ్రిడ్జి నిర్మాణం ఏమోగానీ దాని చుట్టుపక్కల ఉండే ప్రజలు, వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకపోవడంతో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ..

ఆస్పత్రుల ఏరియా కావడంతో నిత్యం జన సంచారం ఎక్కువ. ఇదే సమయంలో పనులు కూడా ముమ్మరంగా నిర్వహిస్తుండటంతో దుమ్ము ఇబ్బందులకు గురిచేస్తోంది. శ్వాస సంబంధమైన రోగాలు వచ్చే అవకాశముందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

నీళ్లు చల్లి మ.మా. అనిపిస్తున్నారు.

పనులు జరుగుతుండటంతో రోడ్డు మీద పలువురు బహిరంగంగా నిరసన వ్యక్తం చేయడంతో ట్యాంకర్లతోని ఆడపా దడపా నీళ్లు చల్లుతూ మ.మా . అనిపిస్తున్నారు ఇదే విషయమై “జనతా న్యూస్”ఆర్ అండ్ బి అధికారులైన డిఈ, జే ఈ లను సంప్రదించగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడి రోడ్డు బ్లాక్ చేయాల్సి ఉండేదని ప్రత్యామ్నాయం లేక ఒక వైపు బ్రిడ్జి పనులు జరుపుతూ మరోవైపు ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డును వదిలిపెట్టమని తెలిపారు. ఇదే విషయమై జనతా న్యూస్ రోడ్డు అద్వానంగా ఉన్న తీరును దృష్టికి తీసుకురాగా సరైన విధంగా ఉండేలా కాంట్రాక్టర్ కు సూచిస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా రోడ్డు అద్వానంగా ఉందని దుమ్ము లేస్తుందని నీళ్ల ట్యాంకర్లతో నీళ్ళు చల్లేలా చూడాలని సదరు గుత్తేదారుకు వివరించానని ఒకటో డివిజన్ కార్పొ రేటర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. అయితే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని కాంట్రాక్టర్ తీరుపై మండిపడ్డాడు.రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న దుమ్ముతో తమ ఆరోగ్యాలు దెబ్బ ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుని ప్రయాణికుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. ఈ చిన్న విషయం ఎలా ఉంటే బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి నియమాలు పాటిస్తున్నారో సదరు అధికారులకే తెలియాలి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page